September 16, 2021

మన ఊరు ఫిరంగిపురం

మన ఊరు… మన వార్తలు…

రాగులు.. రోగాలకు దూరం.

రాగులు రోగాలకు దూరం. కడుపంతా చల్లగా, కూల్‌గా ఉండాలంటే కడుపులో రాగులు పడాల్సిందే. వట్టి రాగులు ఎలా తినాలి అని తిట్టుకుంటున్నారా? మరీ అలా ఎలా చెబుతాం. రాగులు తినమంటే రాగిపిండిని వివిధ రూపాలులోకి మార్చి ఆహారంగా మార్చుకోవాలి. రాగిపిండితో రకరకాల ఐటమ్స్‌ తయారు చేయవచ్చు. ఇది ఎంత తిన్నా ఎలాంటి ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉండవు తెలుసా? అంతేకాదు జీర్ణసమస్యతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంకెందుకు ఆలస్యం. రాగులు కొనండి. పిండి పట్టించండి. వాటితో ఐటమ్స్‌ చేసుకొని తినండి. ఇది తినడం వల్ల శరీరంలోఎలాంటి ప్రయోజనాలుంటాయో మాత్రం తప్పకుండా తెలుసుకోవాలి. అందుకే ఆ విషయాలు సవివరంగా ఇలా..

ప్రయోజనాలు

– రాగులను చూడగానే తేలిగ్గా తీసిపడేస్తారు.

ఇది ఎంత మాత్రం సరైనది కాదు. వీటిలో ఎన్నో పోషకాలున్నాయి అని పెద్దలు చెబుతూనే ఉంటారు. రాగిపిండితో జావ చేసుకొని ఉదయాన్నే తాగితే అటు కడుపు నిండినట్లు ఉంటుంది. ఇటు మధ్యాహ్నం ఎండలో తిరిగినా కడుపు చల్లగా ఉంటుంది. అంతేకాదండోయ్‌.. డీహైడ్రేషన్‌ నుంచి కూడా తప్పించుకోవచ్చు.

– దీంట్లో అధిక మొత్తంలో క్యాల్షియం నిల్వలు ఉంటాయి. దీంట్లో ఉన్నంతగా వేటిల్లో ఉండదు. ఎముకల బలహీనతను అరికట్టడంలో రాగులు ప్రధాన పాత్రపోషిస్తాయి. చిన్నపిల్లల ఎముకలు పుష్ఠిగా ఉండాలంటే మాత్రం రాగిపిండి ఉపయోగించాల్సిందే. ఇదంతా ఎందుకునే అని మాత్రలు మింగుతుంటారు. ఇది అప్పటివరకే ప్రయోజనం ఉంటుంది. చిరకాలం ముప్పులో పడేస్తుంది. రాగిజావ పిల్లలకు తాగిస్తే వారి ఎముకలు బలంగా, దృఢంగా ఉంటాయి.

– బరువు ఎక్కువగా ఉన్నవారు జిమ్ము గిమ్ము అంటూ సమయాన్ని వృథా చేసుకోకుండా ఇంట్లో పనులన్నీ చకచకా చేసి, ఆహార విషయానికి వచ్చే సరికి కొలెస్ట్రాల్‌ తక్కువ ఉండే రాగిజావను ఎంపిక చేసుకుంటే తెలియకుండానే బరువు తగ్గుతారు. అంతేనా.. స్లిమ్‌గా తయారవ్వడం ఖాయం. గోధుమలు, అన్నం కాకుండా రాగులుతో సంకటి చేసుకొని తినండి. ఇందులో అమినో ఆసిడ్లు ఉండడం వల్ల బరువు తేలిగ్గా తగ్గుతారు.

– గ్లూకోజ్‌ లెవెల్స్‌ సాధారణ స్థితిలో ఉంచడానికి ఇది కీలక పాత్ర పోషిస్తుంది. టైప్‌ 2 డయాబెటిస్‌ వ్యాధికి ఇది మంచి మందుగా పనిచేస్తుంది.

– సహజసిద్ధంగా కావాల్సినంత ఇనుము ఇందులో లభ్యమవుతుంది. అనీమియాతో బాధపడేవారు హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచుకునేందుకు రాగులను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. విటమిన్‌ సి స్థాయిలను కూడా ఇది పెంచుతుంది.

– చిన్న పిల్లలకు ఇది మంచి ఆహారం. రోజూ రాగి జావ తాగిస్తే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. రాగిజావ తాగడం ఇష్టపడని పిల్లలకు తియ్యని రాగిజావా కాచి వడపోసి తాగించాలి. దీన్లో బాదాం, కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు. ఇది అదనపు లాభాన్ని చేకూరుస్తుంది.

– రాగిజావలో కొంతమంది మజ్జిగ కలుపుకుంటారు. మరికొంతమంది చక్కెర కలుపుకుంటారు. నచ్చినవారు బెల్లం. లేదంటే గంజి పోసుకొని తాగితే ఆ కిక్కే వేరబ్బా అంటారు.

– ఇలా తిని తిని బోర్‌ కొడుతుంది అనుకుంటే రొట్టెలు చేసేందుకు సిద్ధమవ్వండి. పర్చిమిర్చిని కచ్చబచ్చా చేసి రాగిపిండిలో కలిపి రొట్టెలు తట్టుకొని పెనంపై కాల్చుకొని తినండి. ఆహా.. రాత్రులు డిన్నర్‌కు దీన్నే ఎంచుకోండి. ఒకసారి దీనికి అలవాటు పడితే.. ఇక మరే ఆలోచన దరికి రాదు. అంత టేస్టీగా ఉంటాయి రాగిరొట్టెలు మరి..